Nithya Monthly

శ‌త‌వ‌సంతాల చైత‌న్య వార‌ధి.. కొండ‌పల్లి కోటేశ్వ‌ర‌మ్మ‌

జ్ఞాపకాలు కొందరికి నిట్టూర్పులు, మరికొందరికి మధురానుభూతులు. కానీ ఆమెకు నిత్య చైతన్య దీపికలు. ఊహ తెలిసిన నాటి నుంచీ నేటి వరకూ ఎన్నో ప్రజా ఉద్యమాల దారుల్లో పయనమామెది… ఉద్యోగమో, కాస్తంత ఆర్థిక ప్రయోజనమో, లేదా ప్రభుత్వ అవార్డో చేతికందిన తర్వాత అప్పటివరకూ ఆవేశంగా చెప్పే ఆదర్శాలను చాలామంది అటకమీదకి నెట్టేస్తున్న రోజులివి. ఇలాంటి వాటికి భిన్నంగా తనకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చలించని ధీరత్వంతో, స్ఫూర్తితో జీవితాన్ని ఆదర్శంగా నిలిపిన సాహస మానవి కొండపల్లి కోటేశ్వరమ్మ. ప్రజాజీవితంలో మమేకమై ఉద్యమకారిణిగా, కళాకారిణిగా, కవయిత్రిగా, రచయిత్రిగా.. ఇలా విభిన్న పార్శ్వాలతో నిండైన జీవితం కోటేశ్వరమ్మది. జాతీయోద్యమం, సంఘ సంస్కరణోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, అజ్ఞాత వాసాలతో పెనవేసుకున్న జీవితం ఆమెది. 2018 నాటికి విశాఖలో తన పెద్ద మనుమరాలు కావూరి అనూరాధ సంరక్షణలో ఉంటున్న కోటేశ్వరమ్మగారితో 2018 ఆగస్టులో జరిగిన ఒక సంభాషణ ఇదీ.. . ఆ నెలలో శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అనుభవాలను ఇలా ఆవిష్కరించారు…

మీ బాల్యంలో జరిగిన విశేషాల్ని వివరిస్తారా?

నేను కృష్ణాజిల్లా పామర్రులో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. నాకు నాలుగైదేళ్ళ వయస్సులో ఊహ తెలియని రోజుల్లోనే మా మేనమామతో పెళ్ళైంది. పెళ్ళైన రెండేళ్ళలోపే అతను మరణించాడు. ఏడేళ్ళ వయసులో వితంతువునయ్యాను. ఇవన్నీ నా ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు సాగించాను. ఒకసారి గాంధీగారు మా గ్రామానికి వచ్చారు. ప్రసంగం చేశారు. జాతీయోద్యమానికి విరాళాలు సేకరించారు. ఆ సమయంలో నా ఒంటి మీదున్న బంగారు ఆభరణాలన్నీ అక్కడే ఇచ్చేశాను. నేను ఇంటికి వచ్చేసరికి జరిగింది విని మా అమ్మ నన్ను చీవాట్లు పెట్టినా, నాన్న మాత్రం నా కూతురు ప్రజోపయోగమైన పని చేసిందంటూ ఎంతో మెచ్చుకున్నారు. నా గొంతు చాలా శ్రావ్యంగా ఉండడంతో జాతీయోద్యమ సభల్లో నా చేతే దేశభక్తి గీతాలను పాడించేవారు. నేను వితంతువుగా ఉన్నా కుటుంబ ప్రోత్సాహం ఉండడంతో ఎనిమిదో తరగతి వరకూ చదివాను.

పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యతో జీవితం ఎలా మొదలైంది?

జాతీయోద్యమంలో ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుండేదానిని. అంతకుముందు క్షయ వ్యాధితో చనిపోయిన నా మొదటి భర్త నాకు మళ్లీ పెళ్లిచేయించండని మావాళ్లకు చెప్పి, కొంత పొలాన్నీ నా పేరిట రాసిపెట్టాడట! ఆ విషయం నాకు అప్పటికి తెలియదు కానీ, నాకు పునర్వివాహం చేస్తే ఎలా ఉంటుంది? అనే విషయంపై ఇంట్లోనూ, బంధుమిత్రుల మధ్యా చర్చలు జరిగేవి. అప్పటికే వామపక్షభావాలు నాలో ప్రవేశించాయి. ఎన్నో మలుపులు తర్వాత నాకు అప్పటి సంప్రదాయాలకు, ఊళ్లోవారి మనోభావాలకు వ్యతిరేకంగా పునర్వివాహం జరిగింది. కమ్యూనిస్టు భావజాలంతో ఉత్తేజితుడై, దీక్షగా కార్యకర్తగా పనిచేస్తున్న భర్త కొండపల్లి సీతారామయ్యతో మమేకమై నేనూ పార్టీ కార్యకర్తగా, సాంస్కృతిక ప్రదర్శకురాలిగా గుర్తింపు పొందాను. అప్పటికి ఆయన పీపుల్స్‌వార్‌ పార్టీని ప్రారంభించలేదు. ఆ సమయంలో ప్రభుత్వం నాతో పాటు ఎందరో కమ్యూనిస్టు నేతలను నిర్బంధించింది.

మీ అజ్ఞాత జీవితం ఎలా గడిచింది?

అబ్బో అదంతా పెద్ద సంగతి! అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని విధించింది. ఆ సమయంలో అజ్ఞాత జీవితాన్ని గడపాల్సి వచ్చింది. బందరు, ఏలూరు, విశాఖపట్నం, పూరీ, నాగపూర్‌, రాయచూర్‌, గోంధియాలలో చాలాచోట్ల రహస్య జీవితాన్ని గడిపాను. సహచరులంతా నాకు ఎన్నో విషయాల్లో తమ అండ దండలు అందించారు. ఆ రోజుల్లో భర్తకూ, పిల్లలకూ దూరంగా అజ్ఞాతంగా రహస్య జీవనం సాగిస్తూ పార్టీకి పూర్తిగా సహాయపడేదాన్ని. నాకు ఇద్దరు పిల్లలు (చందు, కరుణ) అజ్ఞాతవాసం ప్రారంభంలోనే పుట్టారు. నిషేధం ఎత్తివేసిన తర్వాత పార్టీ కార్యకర్తగా వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఆంధ్ర, తెలంగాణాల్లో ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎన్నికల ప్రచారంలో మహిళలను పెద్దఎత్తున సమీకరించేదానిని.

‘ప్రజాశక్తి’ పత్రికతో మీ అనుబంధం ఎలాంటిది?

‘ప్రజాశక్తి’ మా పత్రిక. మా సిద్ధాంత భావజాలానికి అనుగుణంగా పీడిత ప్రజల పక్షాన నిలిచిన మా పత్రిక. అప్పట్లో మానికొండ సూర్యావతి, తాపీ రాజమ్మ, కంభంపాటి మాణిక్యాంబ తదితరులతో కలిసి విజయవాడ వీధుల్లో తిరుగుతూ పార్టీ పత్రిక ప్రజాశక్తిని అమ్మేవాళ్లం. అందులో వచ్చిన విశేషాలను గ్రామాల్లో ప్రజలకు వివరించేవాళ్లం. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వైజ్ఞానిక, సాంస్కృతిక అంశాల గురించి, మహిళల ఆరోగ్యం, పారిశుధ్యం వంటి విషయాల గురించి విస్తృతంగా ప్రచారం చేసేవాళ్లం. మహిళలు వేదికలు ఎక్కి సాంస్క ృతిక ప్రదర్శనలు ఇవ్వడాన్ని అసభ్యతగా భావించే ఆ కాలంలో నేనూ, తాపీ రాజమ్మ, వీరమాచినేని సరోజిని, కొండేపూడి రాధ తదితరులం వాటిని ధిక్కరించి ప్రదర్శనలిచ్చాం. ప్రజానాట్యమండలిలో ఒకరుగా నేను అనేక ప్రదర్శనలలో ముఖ్య భూమికను పోషించడమే కాకుండా, పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్‌ గరికపాటి రాజారావు వంటి ప్రముఖుల ప్రశంసలనూ అందుకున్నాను. ప్రజాఉద్యమాన్ని అడ్డుకునేందుకు భూస్వాములు, రౌడీలు, పోలీసులు సాగించిన దుష్ప్రచారాలను, భౌతిక దాడులను పార్టీతో పాటు మా మహిళా కార్యకర్తలమూ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాం.

మీ కుటుంబ విషయాలు, భర్తతో విభేదాలు ఎలా ఏర్పడ్డాయి?

భర్తతో విబేóదించిన అంశాలు నా ప్రమేయంతో జరిగినవి కావు. వాటి వెనుక అంతర్గతంగా చాలా కారణాలున్నాయి. మేము విడివిడిగా అజ్ఞాతంగా గడిపిన రోజుల్లో కొన్ని అనుబంధాలవైపు సీతారామయ్య ఆకర్షితుడయ్యాడు. నన్ను విడచి, వేరే ఊరు (వరంగల్‌) వెళ్ళి అక్కడ మరో ఆమెతో ఉండటం ప్రారంభించాడు. మా ఇద్దరు పిల్లలు చందు, కరుణను తనదగ్గరే ఉంచుకున్నాడు. అప్పటికి పార్టీ చీలిపోవడం, రకరాల కారణాల వల్ల చాలామంది దూరంగా జరిగారు. అయితే ఆత్మీయులైన వారంత ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. అప్పటికి నాకు ముప్పై ఐదేళ్లు. హైస్కూలు చదువూ ఎప్పుడో ఎనిమిదో తరగతితోనే ఆగిపోయింది. ఎలాంటి ఉపాధి పొందే దారులేం కన్పించడం లేదు. ఆర్థికంగా ఏ ఆలంబనా లేకుండా పోయింది. గతంలో నిషేధకాలంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాల కోసం అమ్మిన నా నగల విలువను పార్టీ నాకు తిరిగి ఇవ్వబోతే, సీతారామయ్య వాటిని తీసుకోనివ్వలేదు. నేనూ సున్నితంగా తిరస్కరించాను. పిల్లలిద్దర్నీ సీతారామయ్యే చదివించాడు. కరుణ డాక్టర్‌ అయింది. చందు అతనితో పాటు నక్సలైట్‌ ఉద్యమంలోకి వెళ్లిపోయాడు.

ఇన్ని ఒడుదుడుకుల మధ్య ఎలా నిలదొక్కుకున్నారు?

చాలామంది మాదిరిగానే నా జీవితంలోను అనేక కష్టాలు ఎదురయ్యాయి. నా కుమారుడు చందును పోలీసులు మాయం చేసినప్పుడు, నా కుమార్తె కరుణ మానసిక వేదన భరించలేక మరణించినప్పుడు – ఇంకా ఇలా రకరకాల కష్టాలు వెంటాడుతున్నప్పుడు – అనేకమంది మిత్రులు నాకు తోడుగా నిలిచారు. అలాంటప్పుడు – కార్యశూరులు, త్యాగధనులనిపించుకున్న మహనీయుల స్ఫూర్తితో మనిషి ఉత్తేజితుడవుతాడేమో..

వారి ఓదార్పు ఊపిరులూదుతుందేమో అనిపిస్తుంది. ఆ కారణంతోనే నేను ఇన్నాళ్లు జీవిస్తున్నానేమోననీ అనిపిస్తుంది. నాకు ఉపాధిలేని రోజుల్లో స్వశక్తితో నా కాళ్ళపై నేను నిలబడడానికి ప్రయత్నించాను. ఆ వయసులో నేను హైదరాబాదు ఆంధ్ర మహిళాసభ హాస్టల్‌లో చేరాను. అక్కడే మెట్రిక్‌ పూర్తిచేశాను. ప్రభుత్వం వారిచ్చిన స్టయిఫండ్‌ ఫీజులకు సరిపోతే, రేడియో నాటకాల్లోనూ, కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ, కథలు రాస్తూ సంపాదించుకున్న కొద్ది డబ్బు మాత్రం సొంత ఖర్చులకు సరి పెట్టుకునేదానిని. పరీక్షలు బాగా రాసి, మెట్రిక్‌ పాసయ్యాను. ఇంకా చదవటానికి వీలులేకపోవడంతో కాకినాడ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ గరల్స్‌ హాస్టల్లో మేట్రన్‌ ఉద్యోగంలో చేరాను. అక్కడే రిటైర్‌ అయ్యేవరకూ పనిచేశాను.

సాహిత్య వ్యాసంగం ఎలా మొదలైంది?

నేను ప్రజానాట్యమండలిలో చురుకైన కళాకారిణిని. అప్పట్లో పాటలు బాగా పాడేదానిని. ఉద్యమావసరాల కోసం పాటలూ రాసేదానిని. అయితే నేను కాకినాడలో ఉంటున్న కాలంలో ఇటు ఉద్యోగం చేస్తూ అటు రచనా వ్యాసంగంలో బాగా నిమగమయ్యాను. అక్కడుండే సోమసుందర్‌ వంటి కవులూ, రచయితల తోడ్పాటు వల్ల కాకినాడలో సాహిత్య సభల్లో విరివిగా పాల్గొంటూ ఉండేదానిని. ఆ వాతావరణం నా రచనా వ్యాసంగానికి ఎక్కువగా ఉపయోగపడింది. అంతకు ముందు ఉద్యమ సమయంలోనే నా భర్త దూరమయ్యాడు. నా బంగారమంతా పార్టీకి ఇచ్చేశాను. ఇద్దరు పిల్లలను పోషించ లేని దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నా. పిల్లలు నాకు దూరంగా ఉన్న సమయంలో- వాళ్లకు కథలు చెబుతున్నట్లు ఊహించు కుంటూ – ‘అమ్మ చెప్పిన కథలు’ రాశాను. ఆ తర్వాతా అనేక రచనలు చేశాను. ‘అశృసమీక్షణం’ కవిత్వం, ‘సంఘమిత్ర’ కథలు. ‘నిర్జనవారధి’ స్వీయ జీవనగాథ.. ఇలాంటి రచనలు చేశాను. చాలా రచనలు ఇతరభాషల్లోనూ అనువాదితమయ్యాయి.

ఈ వయసులోనూ.. ఇంత చురుకుదనం ఎలా సాధ్యం?!

‘ఇతరులకు అపకారం చేయనివారు, సమాజానికి మేలు చేసేవారు ఎక్కువ కాలం బతుకుతారు..’ అని నాతో ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య చెప్పారు. ఈ వాక్యాలు నా విషయంలో నిజమేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే నేను ముందుకు నడిచాను. ఇంత కాలం ఆరోగ్యంగా బతకడానికి బహుశా అదే కారణం అయ్యుంటుంది. పరుల కోసం పాటుపడాలన్న తపన మరికొంత కాలం జీవించేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వృద్ధాప్యం వల్ల వినికిడిశక్తి కొంత తగ్గింది. అయినా జీవితంలో ఎదురైన విషయాలన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి. నా చిన్నప్పుడు సంస్కరణోద్యమం కారణంగా వీరేశలింగం ప్రభావం మా కుటుంబంపై తీవ్రంగా ఉండేది. పెద్దయ్యాక ఉద్యమాలలో పాల్గొనేటప్పుడు కలిగే ఒత్తిళ్లు, వ్యక్తిగత జీవితంలో నాకు ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానంటే- నా మానసిక స్థైర్యమే ప్రధానకారణం.

మీకు స్ఫూర్తినిచ్చిన ప్రముఖులు ఎవరెవరు?

ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో.. ప్రత్యేకంగా వారు అనుసరించమని నాకు చెప్పలేదు. వారి నిజాయితీ, ఆశయ నిబద్ధత ఎవరినైనా సరే ప్రభావితం చేస్తాయి. నా సహచరులైన మహిళాకార్యకర్తలూ నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిచ్చారు. జీవితంలోని కీలక మలుపుల్లో తమ అండదండలూ అందించారు. నన్ను అభిమానించే వాళ్లను ఎంతోమందిని సంపాదించుకోగలిగాను. ప్రేమించేవారినీ పొందగలిగాను. వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం. దానిముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి. ఎంచుకున్న మార్గంలో రాజీపడకుండా నడిచి.. సంఘసేవలో తరించానన్న సంతృప్తే నన్ను ఇప్పటికీ చురుగ్గా నడిపిస్తోంది.

గౌరీ లంకేష్‌ నన్ను కలవాలనుకుంది!

గతేడాది (2017) జులై నెలలో సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ నన్ను కలవాలనుకుంటున్నట్టు చెప్పింది. చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. నేటి సామాజిక రాజకీయ అంశాలపై అమెకు ఎంతో సునిశితమైన అవగాహన ఉంది. ఆమెలాంటి నిబద్ధత గలిగినవారి అవసరం నేడు చాలా అవసరం ఉంది. ఒకప్పుడు మేము ఎదుర్కొన్న పరిస్థితుల కంటే వాతావరణం మరింత జఠిలంగా మారింది. ఆమె నన్ను కలవడానికి సెప్టెంబర్‌లో వస్తానంది. ఈలోగానే ఆమెను విద్రోహులు హత్య చేశారు. ఈ ఘటన నా మనసుని బాగా బాధించింది.

– సంభాషణ : బెందాళం క్రిష్ణారావు (5/8/2018)

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!