నవమాసాలు కడుపున మోసి
నరకపు ప్రసవ వేదన నిండిన నొప్పులు
పంటిబిగువున దాచి లోకాన్ని పరిచయం చేసి
తన రుధిరాన్ని స్తన్యంగా అందించి
గోరు ముద్దలు అందించి ఆకలి తీర్చి
పడుతూ లేస్తూ అడుగులు మొదలెడిన నాకు
తన చేయందించి అడుగులు నేర్పిన తల్లి
ఆది గురువు కాదా
ఎనిమిదేళ్ళ వయసప్పుడు ఎదురింటి
పెరట్లో నోరూరించిన జామకాయలు దొంగిలించి
తెలియక చేసిన తప్పుకు అమ్మ కొట్టిన దెబ్బతో
ఎర్రగ కందిన నా పసి చెంప పై జారిన కన్నీరు
ఆ కన్నీటినీ తుడిచి నా కందిన బుగ్గపై తన కన్నీళ్ళతో
ప్రేమ పన్నీరు చిలకరించి అమ్మ పెట్టిన చిరుముద్దులు
తప్పు సరిదిద్దుకోవాలంటూ మంచి చెడులు నేర్పిన
అమ్మ ఆదిగురువు కాదా
చదువెంతో కష్టమని ఇష్టం తో చదవమని
చదువు విలువ తెలుసుకొని చదువును ప్రేమిస్తూ
భవిత దిద్దుకోమని తమలాంటి భర్త చాటు
ఆర్థిక బానిసత్వం వద్దని గౌరవనీయమైన
ఆర్థిక స్వాతంత్య్రపు అమృతాన్ని జీవితాన
పొందమని దీవించిన
తల్లి ఆదిగురువు కాదా
సమాజం ఒక వైపు మంచి ఇంకో వైపు చెడు వలయం
అని మంచికి చేయందించి చెడును ఎండ గట్టమంటూనే
క్షేమంగా ఉండమని దీర్ఘంగా జీవించమని
సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని
ఆయురోగ్యాలు పొందమని మనస్ఫూర్తిగా
ప్రేమించి జీవించే అమ్మ ఆది గురువే.
*********
– డబుర ధనలక్ష్మి