ఇంటి కోడలిని దేవి అవతారం అని ఒక మామగారు ఖరారు చేస్తారు. ఆ దేవి పాదాల చెంత పెట్టిన రోగగ్రస్త శిశువు యాధృచ్చికంగా నయమౌతుంది. అంతే! ఆమె అపర దేవతగా జనులందరిచేతా నీరాజనాలందుకుంటుంది. చదువు ముగించుకుని ఇంటి కొచ్చిన భర్తకు ఈ వేలం వెర్రి చిరాకు తెప్పిస్తుంది. తన భార్యను ‘నార్మల్’ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆమె కూడా తను దేవతనేనని గాఢంగా నమ్మడంతో ఫలితం కనిపించదు. కానీ సొంతింటి బిడ్డను తన దైవశక్తి నయం చేయలేకపోవడంతో, తన ఒడిలోనే ఆ బాబు ప్రాణం విడవడంతో ఆమె పిచ్చిదిగా మారి ఎటో మాయమైపోతుంది. ‘దేవి’ సినిమాను సత్యజిత్ రాయ్ 1960 లో నిర్మించినపుడు అతడ్ని హిందూ వ్యతిరేకి అని విమర్శించారు. ఆ విమర్శలకు వెరవలేదు రాయ్. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది. ప్రజల మేలు కోరిన వాడినే కొందరు స్వార్థపరులు ప్రజాశత్రువుగా ముద్రవేయడాన్నిరాయ్ తన 1989 సినిమా ‘గణశత్రు’ లో చూపాడు. ‘దేవి’ నాటి విమర్శలకు ఒక విధంగా సమాధానం చెప్పాడు సత్యజిత్.
అప్పటి ‘దేబ్ శిశు’ (1985):
‘హేతుతత్వం, శాస్త్రీయ జిజ్ఞాస అలవరుచుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం’ అని రాజ్యాంగంలో రాసుకున్న స్వాతంత్ర్య భారతావని పయనం రోజురోజుకూ మూఢత్వానికి చేరువగా సాగింది. భారతీయ ఆర్ట్ సినిమాల్లో భాగంగా ఉత్పలేందు చక్రవర్తి తీసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా చాలా విలక్షణమైన సినిమాలు తీశాడాయన. బహుప్రశంసితమైన ‘చోఖ్’ (1982) సినిమా తర్వాత 1985 లో అయన ‘దేబ్ శిశు’ (బాల భగవానుడు) అనే సినిమా తీశాడు. ఇందులో స్మితా పాటిల్, సాధూ మెహెర్, ఓం పురి, రోహిణి హట్టంగడి వంటి సుప్రసిద్ధ నటులు నటించారు. మంచి ఇతివృత్తాలను ప్రోత్సహించాలని స్మితా పారతోషికం తీసుకోకుండా ఈ సినిమాలో నటించింది.
సినిమా కథ:
సీత, రఘు చాల పేదరికంలో జీవిస్తున్న బీహార్ గ్రామంలోని దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. పెద్దాడికి ఐదు సంవత్సరాలు, చంటాడి వయసు రెండు. బీహార్ వరదల్లో సర్వం కోల్పోయి, సీత తన పరివారాన్ని వెంటబెట్టుకుని బెంగాలు గ్రామంలో ఉంటున్న తన అన్నయ్యను ఆశ్రయిస్తుంది. సీత వదిన లీల కొంచెం ఉన్నోళ్ళ బిడ్డ. పూట గడవక పంచన చేరిన సీతకు సూటిపోటి మాటలంటూ ఉంటుంది లీల. గతిలేక ఆ ఇంటిలో వెట్టి చాకిరీ చేస్తూ గడుపుతూ వుంటారు. బజారు నుండి గోదుమలు తీసుకు రమ్మని రఘుకు ఐదు రూపాయలిచ్చి పంపిస్తుంది లీల. బజారులో రఘుకు అతడి పాత స్నేహితుడు కనిపిస్తాడు. మనసు బరువు దింపుకోడానికై రఘు తన కష్టాలు ఏకరువు పెడతాడు స్నేహితుడితో. ఆ స్నేహితుడు రఘుకు ఒక సలహా ఇస్తాడు. ‘దగ్గరలోని టౌన్లో ఒక ‘దేవశిశువు’ కొలువై వున్నాడు. 19 పైసల టిక్కెట్టు పెట్టి ఆ బాల భగవానుడి దర్శనం చేసుకుంటే, కష్టాలన్నీ తీరుతాయి. ఆ ‘దేవశిశువు’ మహత్యాల గురించి వూరి జనాలు ఎన్నో కథలు చెప్పుకుంటున్నారు. ఇదో లాటరీ అనుకుని నీ అదృష్టం పరీక్షించుకో’ అని స్నేహితుడు చెబుతాడు. కష్టాల్లో మనిషి కంటికి ఎదురైనదంతా నమ్ముతాడు. అందుకే ఏమైతే అయిందనుకుని తన దగ్గర మిగిలిన చిల్లర లోంచి టిక్కెట్టు కొనుక్కుని పెద్ద క్యూలో నిల్చుని చివరికి ‘దేవశిశువు’ను చూస్తాడు. చూసి గతుక్కుమంటాడు. ఎందుకంటే ‘దేవశిశువు’గా కొలువైన ఆ పిల్లాడు తమకు పుట్టిన బిడ్డే. ఆ బిడ్డ పుట్టినప్పుడు సీతకు ప్రాణం పోయినంత పనైంది. మూడు తలలతో, నాలుగు చేతులతో పుట్టిన ఆ బిడ్డను చూసి మంత్రసాని కూడా భయపడిపోయింది. ఈ బిడ్డ ఊరికి అరిష్టం. ఇది దయ్యం పిల్ల. దీన్ని వదిలించుకోవలసిందే అని రఘుకు చెబుతుంది మంత్రసాని. రఘు భూత వైద్యుడి దగ్గరకు దౌడు తీస్తాడు. ఆ వైద్యుడి అల్లుడు ఒక చిల్లర మాంత్రికుడు. మామా అల్లుళ్ళు మంచి ప్లాను వేస్తారు. భయపడ్డ రఘుకు మరింత భయపెడతారు. ‘ఈ బిడ్డ సంగతి తెలిస్తే నీపై పోలీసు కేసు అవుతుంది. ఆ బిడ్డను మాకు అప్పజేప్పేయ్, నీ సమస్య తీరుతుంది’ అని అతడ్ని ఒప్పించి ఆ బిడ్డను కైవశం చేసుకుంటారు. వారే ఇప్పుడు ఆ బిడ్డను దైవ పుత్రుడిగా చూపుతూ వేలకువేలు గడిస్తున్నారు. ‘నా బిడ్డతో వ్యాపారం చేస్తున్నారా? ఈ సంపాదనలో నాకూ సగం వాటా ఇవ్వవలసిందే. నేను కష్టాల్లో ఉన్నాను’ అంటూ చిల్లర పళ్ళెంలోని కాసుల్ని పిడికిలిలోకి తీసుకుంటాడు రఘు. ఆ దైవ వ్యాపారుల గుండాలు అతడ్ని వెంబడించి తీవ్రంగా కొడతారు. చేతిలోని గోదుమలు కూడా నేలపాలౌతాయి. ఎంతకూ తిరిగిరాని భర్త కోసం రాత్రంతా జాగారం చేస్తుంది సీత. అర్ధరాత్రి దాటాక బాగా రక్తసిక్తమైన స్థితిలో ఇంటికి వస్తాడు భర్త. ‘మనకు అష్టావక్రుడైన వాడు, అరిష్టమైన వాడు వారికి దేవుడై కాసులు కురిపిస్తున్నాడు. రా! నాతో రమించు, మళ్ళీ అలాంటి బిడ్డనే కందాం. మన కష్టాలు తీరుతాయి’ అని భార్య మీదికి విరుచుకు పడతాడు. సీత అతడ్ని బలంగా తోసేస్తుంది. వారి జీవితాలు ముళ్ళ కంచెలో ఇరుక్కున్నాయన్నట్టు దర్శకుడు ప్రతీకాత్మకంగా చూపుతాడు ఓ దృశ్యంలో. సినిమా ఆఖర్లో ఆ దంపతులు తమ పిల్లలతో మరో గమ్యం తెలీని చోటుకు ప్రయాణమౌతారు. దారిలో వారికి అక్కడ కూడా ‘దేవశిశువు’ ప్రచార వాహనం ఎదురౌతుంది. ఎనభయ్యో దశకంలో వచ్చిన మంచి సినిమాల్లో గుర్తుంచుకోదగ్గది ఈ సినిమా. పేదరికం, కుల వ్యవస్థ, మతం, దైవ వ్యాపారం వంటి అంశాలను చాలా చక్కగా విశ్లేషిస్తుంది. ప్రచారపు ఎత్తుగడతో దయ్యాన్ని దేవుడిగా చలామణి చేయించవచ్చనీ, సమాజంలో నేడు అదే జరుగుతోందనీ సమర్థవంతంగా చెప్పాడు ఉత్పలేందు. కానీ నిజానికి ఆ శిశువులంతా శారీరక లోపంతో పుట్టిన అభాగ్యులు. వారికి సరైన చికిత్స అవసరం, వారి పట్ల సమాజం చాల బాధ్యతాయుతంగా, ప్రేమ పూర్వకంగా మెలగాలి. ‘దేబ్ శిశు’కు సిలిండర్ నుండి గాబరా గాబరాగా ఆక్సిజన్ అందించేసి దర్శనార్ధుల కోసం గంటల తరబడి కూర్చోబెట్టడం చాలా క్రూరమైన చర్యగా మనకు కనిపిస్తుంది. ‘దేవుడు’ అంటూనే దేవుణ్ణి కష్టబెట్టే మానవ దయ్యాల వ్యాపారం ఇది!
ఇప్పటి ‘లొక్కీ చెలె’ (2020):
ప్రస్తుత బెంగాల్ ఫిలిం ఇండస్ట్రీలో తనదైన ముద్రను ఏర్పరుచుకున్న ప్రగతిశీల దర్శకుడు కౌశిక్ గంగూలీ. ‘శబ్దో’, ‘సినెమావాలా’, ‘జ్యేష్టపుత్రో’, ‘బిసర్జన్’, ‘నగర్ కీర్తన్’ వంటి అవార్డులు పొందిన చిత్రాలతో తనదైన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నాడు కౌశిక్ గంగూలీ. నందితా రాయ్ – శివప్రసాద్ ముఖోపాధ్యాయ అనే విజయవంతమైన దర్శకద్వయం వారి ప్రొడక్షన్ హౌస్ ‘విండోస్’ సంస్థ కోసం కౌశిక్ గంగూలీ నిర్మించిన చిత్రం ‘లొక్కీ చెలె’. ఈ 2020 లో నిర్మితమైన ఈ సినిమా వివిధ చలనచిత్ర ఉత్సవాల్లో పాల్గొంటూ, గత ఆగష్టు 26 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇందులో కౌశిక్ భార్య చుర్నీ గంగూలీ కూడా నటించింది. కౌశిక్, చుర్నీల కుమారుడు ఉజాన్ గంగూలీ ఇందులో ప్రధాన పాత్రను పోషించాడు. 2005 లో బీహార్‌లో ఎనిమిది కాళ్ళూచేతులతో జన్మించిన లక్ష్మీ తత్మా అనే పాపకు సంబంధించిన వాస్తవ గాథ ప్రేరణతో ఈ సినిమా నిర్మించారు.
సినిమా కథ:
కోల్‌కతాకి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒక బెంగాలు గ్రామం. అది ఆశ్ప్రుస్యుల గ్రామం. ఆ వూరి నీడ కూడా తాకకుండా అందరూ తప్పించుకు తిరుగుతారు. ఆ ఊరి వారు శతాబ్దాల వెలివేతనూ, అన్యాయాలనూ, అవమానాలనూ భరించారు. అలాంటి వూరిలో ఒక దళితుల ఇంట్లో నాలుగు చేతులున్న ఒక పాప పుడుతుంది. ఆమెను ‘బుల్లి లక్ష్మి’ లేక ‘లక్ష్మీ దేవి అవతారం’ అని ఆ వూరిలో వారు అనుకుంటారు. ‘అంటరానోళ్ళ ఊరిని లక్ష్మీ దేవి కరుణించింది రోయ్’ అని సంబరపడతారు. ఈ వార్త అక్కడి అగ్రవర్ణ జమిందారు రజత్ నారాయణ్ రాయ్ కి (ఇంద్రాసిస్ రాయ్) చేరుతుంది. అతడి మాటకు ఆ ప్రాంతంలో తిరుగులేదు. ‘బుల్లి లక్ష్మి’ వార్త నిజమేనని నిర్ధారించుకున్న అతడికి ఇందులో గొప్ప వ్యాపార రహస్యం వుందని అర్థమౌతుంది. మొదట ఆ గ్రామాన్ని పురోహితులతో శుద్ధి చేయిస్తాడు. అంటే ఇక ఆ గ్రామంలోకి ఎవరైనా వెళ్ళవచ్చన్న మాట! ఆ దళిత పరివారానికి ఒక చిన్నపాటి సంపాదన ఎర చూపి, ఆ ప్రాంతాన్ని ఒక తీర్థ స్థలంగా మార్చేస్తాడు. రాజకీయాలపై ఆశలు ఉన్న ఆ జమిందారు తన ఫొటోలతో ఊరంతా లక్ష్మీ తీర్థస్థల ప్రచార పోస్టర్లు నింపేస్తాడు. భవిష్యత్తులో ఒక పెద్ద మందిరం కట్టేయాలన్న ప్లాను కూడా వుంది అతడికి. చుట్టు పక్కల ఊర్ల వారంతా క్యూలు కట్టి పాపను దర్శించి, దక్షిణ చెల్లించి, ఆ పాప కాళ్ళకు మొక్కి వెళుతుంటారు. స్పెషల్ దర్శనం చేయించే ఏజెంట్లు కూడా తయారౌతారు.
ఒక పెళ్లి పార్టీ నుండి కోల్కతాకు తిరిగి వెళ్తున్న ముగ్గురు మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు తమ కారు పాడవడంతో ఆ ప్రాంతంలో ఇరుక్కుంటారు. అమీర్ హుస్సేన్ (ఉజాన్ గంగూలీ), శివ్ నాథ్ (పూరబ్ సీల్ ఆచార్య), గాయత్రి (రిత్వికా పాల్) అనే ఆ ముగ్గురికి ‘బుల్లి లక్ష్మి’ని చూడాలన్న కోరిక కలుగుతుంది. ఒక ఏజెంట్ ద్వారా స్పెషల్ దర్శనం తొందరగా దొరుకుతుంది. అమీర్ హుస్సేన్ ప్రత్యేక ఆసక్తితో రెండో సారి దర్శనం చేసుకుని ఆ పాప పాదం ముట్టుకుని వస్తాడు. ఆ పాపకు జ్వరం వుందని తెలుస్తుంది. ఆ మెడికల్ విద్యార్థులకు విషయం అర్థమౌతుంది. అదో అరుదైన శారీరక లోపం. దాన్ని వైద్య పరిభాషలో ‘Parasitic Twin Syndrome’ అని అంటారు. కవల పిల్లలు తయారౌతూ ఒక బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెంది, మరో బిడ్డ శరీరంలోని కొన్ని భాగాలూ మాత్రమే తయారై అవి మొదటి బిడ్డ శరీరానికి అతుక్కున్న పరిస్థితి అన్న మాట. శరీరం బయట అదనపు చేతులు కనిపిస్తున్నా శరీరం లోపల కూడా కొన్ని భాగాలూ తయారైవుండి ఉండవచ్చు. వాటిని గుర్తించి సర్జరీ చేసి తొలగించాలి. లేకపోతే అటువంటి శిశువులు ఎక్కువ కాలం బ్రతకరు. కానీ మూఢ విశ్వాసాలలో ఉన్న ఈ పామరులకు అర్ధం చేసేదెలా?
ఆ యువకులు శతవిధ ప్రయత్నాలు చేస్తారు. ‘పాపకు జ్వరం, పారాసెటమాల్ వెయ్యాలి’ అని చెబితే ‘దేవతకు జ్వరం ఏమిట’ని అవతలి నుండి ఎదురు ప్రశ్న. వీడియో సహాయంతో ఆ జబ్బు వివరాలనూ, అటువంటి శిశువుల వివరాలనూ చూపిస్తారు. కానీ అందరిలోకీ ఆ ఇంటి పెద్ద ముసలాయన ‘హరేన్ ఖురో’ మాత్రం దేనికీ ఒప్పుకోడు. ఆ దళిత తల్లికి మాత్రం తన బిడ్డ బ్రతకాలని ఉంటుంది. డాక్టర్లు రహస్యంగా వేయమని ఇచ్చిన చుక్కల మందుతో పాప జ్వరం తగ్గడం చూశాక ఆమెకు డాక్టర్ల మాటపై గురి ఏర్పడుతుంది. ఆమె సహకారం అందడంతో పాపను దొంగతనంగా కోల్కతాకు తీసుకువెళ్ళి సర్జరీ చేయించాలని నిర్ణయించుకుంటారు ఆ యువకులు.
వారి అధ్యాపకురాలు డాక్టర్ మితాలీ వారికి సహకరిస్తుంది. ఆమె మాజీ భర్త, ప్రస్తుత మంత్రి రితోబ్రోతో సేన్ సహకారం అందడంతో వారు అనుకున్నది సాధిస్తారు. కానీ ఆ పాపను ఆమె తల్లికి అప్పజెప్పాలి. అప్పుడే వారి పని పూర్తయినట్టు! ఈ మొత్తం ఎపిసోడ్ లో చురుకైన పాత్ర పోషించిన అమీర్ ఈ ఆఖరు పనిని కూడా తనే పూర్తి చేయడానికి ముందుకు వస్తాడు. పాప మాయమవడంతో యాత్రా స్థలిగా మారిన ఆ వూరు మళ్ళీ స్మశానంలా మారివుంది. ఆరోగ్యవంతంగా తిరిగి వచ్చిన పాపను అక్కున చేర్చుకుందామని ఆ తల్లికి అనిపించినా, ఇంటి వారు మాత్రం ఆ పాపను ముట్టుకోవడానికి ఇష్టపడరు. ‘మా నాలుగు చేతుల లక్ష్మిని తిరిగివ్వు. ఇది మా పాప కాదు’ అని నిరాకరించేస్తారు. తన స్వార్థ ప్రయోజనాలు దెబ్బతిని రగుల్తూ ఉన్న జమిందారు అక్కడికి వస్తాడు. ‘ఒక ముస్లిం డాక్టరు హిందూ దేవతను ఆపరేషన్ చేయించాడన్న మాట! నిన్ను సన్మానించవల్సిందే’ అని అతడ్ని జమిందారు లాక్కుపోతాడు. ఈ గలాటా మధ్యలో మిగిలిన ఇద్దరు విద్యార్థులు పాపను తీసుకుని పారిపోతారు. సినిమా ముగింపు చెప్పడం బావుండదు గానీ ఈ సినిమా కొన్ని అవసరమైన ప్రశ్నల్ని రేపుతుంది.
– ఒక రోగస్థ శిశువును చికిత్స చేయకుండా దేవత పేర పూజించే సమాజం రోగగ్రస్తమైనది కాదా?
– పాపను చావనిచ్చి ధర్మాన్ని రక్షించడమా? లేక ఆమెను కాపాడి మనవ ధర్మాన్ని చాటుకోవడమా?
– దుర్గా దేవిలా అందంగా ఉన్న కోడలికి ఆ దేవతలానే పది చేతులు ఉంటేనో! అటువంటి సంబంధాన్ని పెద్దలు ఒప్పుకుంటారా?
సరదాగా ఈ మూడో ప్రశ్న వేసిన ఈ సినిమా పది తలలు లేక పది చేతులు కేవలం రూపకాలు మాత్రమే అని వివరిస్తుంది. ఈ సినిమా ద్వితీయార్ధంలో కథనం కొంత బలహీనంగా అనిపించింది. ‘ఉపన్యాస ధోరణి’ కథనాన్ని కొంత నష్టపరిచింది. సన్నివేశాల ద్వారానే చెప్పాలనుకున్నది చెప్పాలి. (‘మలయన్ కుంజు’ మాదిరిగా) మరో నచ్చని అంశం బాబుల్ సుప్రియోకి ఇచ్చిన పాత్ర. అయన ఆసన్సోల్ లో బిజెపి ఎం పి గా ఉన్నప్పుడు జరిగిన మతకలహాల్లో మొహమ్మద్ శిబ్గతుల్లా అనే పదో తరగతి అబ్బాయిని అతి భయంకరంగా చంపారు దుండగులు. మృతుడి తండ్రి ఒక మౌల్వీ. అయన తన కుమారుడి హంతకులను క్షమించాననీ, రక్తపాతం వద్దనీ తన వారికి పిలుపునిచ్చాడు. ఆ రోజుల్లో బాబుల్ చర్యలు మాత్రం మరోలా వున్నాయి. అందుకే అతడు ‘అమీర్’ పేరును తన మొబైల్ లో ‘లొక్కీ చెలె’ (మంచబ్బాయి) అని సేవ్ చేసుకున్నట్టు చూస్తే విడ్డూరం అనిపించింది. మతాన్ని పక్కనపెట్టి, ‘బుల్లి లక్ష్మీదేవి’లను కాపాడే ‘లొక్కీ చెలె’ల అవసరం ఈ సమాజానికి ఎంతైనా వుంది. సినిమాలో హిందూ మంత్రాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడడం బాగుంది. ఈ సినిమా జనాదరణ పొందడం శుభ సూచకం!
– బాలాజీ (కోల్కతా)
Sir plz resend my